కల్వకుంట్ల కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందిస్తుందనుకుంటే సిఎం రేవంత్ రెడ్డి స్పందించడం విశేషం.
ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ,” హరీష్ రావు వెనుక నేనున్నాని కవిత అంటుంది. ఆమె వెనుక నేనున్నానని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మీలో మీరు కుమ్ములాడుకుంటూ, ఒకరినొకరు ఈవిదంగా దెబ్బ తీసుకుంటూ మద్యలో నన్నెందుకు లాగుతున్నారు?
అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు అవినీతి సొమ్ము పోగేసుకున్నారు. ఇప్పుడు ఆ అవినీతి సొమ్ము పంపకాలలో గొడవలతోనే ఇలా రోడ్డున పడి కుమ్ములాడుకుంటున్నారు. మీ ఇంట్లో, మీ పార్టీలో పంచాయితీలు ఉంటే మీరూ మీరూ తేల్చుకోండి. కానీ మద్యలో నన్ను, నా పార్టీని లాగొద్దు.
అయినా ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించారు. మీ పార్టీ చెల్లని వెయ్యి రూపాయల నోటు వంటిది. మీలాంటి కుట్రలు చేసేవారితో, అవినీతిపరులతో బుద్ధున్నవాడు ఎవడైనా చేతులు కలుపుతాడా?
నాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మీరు, మీ పార్టీ, మీ కుటుంబం తప్ప రాజకీయాలలో మరెవరూ ఉండకూడదని చేసిన కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, వేధింపుల వల్లనే ప్రకృతి ఇప్పుడు మీకు ఈ ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తోంది. అయినా మీ బుద్దులు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది,” అని అన్నారు.