పార్టీ మునిగిపోవడానికి హరీష్, సంతోష్ కారణం: కవిత

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన కల్వకుంట్ల కవిత ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరోసారి హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముందుగా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటూ, కేసీఆర్‌కి నమ్మక ద్రోహం చేస్తున్నారు. పార్టీని నిలువునా ముంచేశారు. నేను నిజామాబాద్‌లో, కేసీఆర్‌ కామారెడ్డిలో ఓడిపోవడానికి, దుబ్బాకలో ఈటల రాజేందర్ గెలవడానికి కారకులు వీరిద్దరూ తెర వెనుక చేసిన కుట్రలే. 

వీరి కారణంగానే బీఆర్ఎస్‌ పార్టీ నుంచి విజయశాంతి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వంటి వారు అనేకమంది బయటకు వెళ్ళిపోయారు. నేడు బీఆర్ఎస్‌ పార్టీ ఇంత దయనీయ స్థితిలో ఉందంటే దీనికి కారణం వీరిద్దరే. ఇద్దరూ కేసీఆర్‌ నీడలా ఉంటూ ఆయనకు వెన్నుపోటు పొడుస్తూ పార్టీని ఈ దుస్థితికి తీసుకువచ్చారు. 

వారు రాజకీయంగా, ఆర్ధికంగా చాలా లబ్ది పొందారు. కానీ వారి ఉన్నతికి కారణమైన కేసీఆర్‌ని నిలువునా  ముంచేశారు. పార్టీని ముంచేయడమే కాక మా కల్వకుంట్ల కుటుంబంలో కూడా చిచ్చుపెట్టి చివరికి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. 

నేను, రామ్మన్న (కేటీఆర్‌) అధికారం, పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదు. ఆనాడు కేసీఆర్‌ ఒక్కరే తెలంగాణ కోసం ఒంటరిగా కొట్లాడుతుంటే ఆయనకు తోడుగా నిలబడేందుకే వచ్చాము. అప్పటి నుంచి కేసీఆర్‌ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటూ పార్టీ కోసమే పనిచేశాము.

దాదాపు 20 ఏళ్ళుగా నేను పార్టీ కోసం పనిచేస్తే చివరికి నన్ను ఇంత అవమానకరంగా బయటకు గెంటేశారు. అయినా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా కేసీఆర్‌ మేల్కొని పార్టీకి పట్టిన ఈ రెండు చీడపురుగులను ఏరి బయట పారేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే వారు పార్టీని, మిమ్మల్ని సర్వనాశనం చేయకుండా విడిచిపెట్టరు. 

ఇప్పుడు నన్ను బయటకు పంపారు కనుక మళ్ళీ నేను ఏ ప్రజల కోసం పనిచేశానో వారి వద్దకే వెళ్ళి పోరాడుతాను. కానీ ఈ ఇద్దరు చీడపురుగులు బీఆర్ఎస్‌ పార్టీని తినేయకుండా జాగ్రత్త పాడమని బీఆర్ఎస్‌ పార్టీ శ్రేయోభిలాషులను, కార్యకర్తలని, మా కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. చివరిగా జై తెలంగాణ... జై కేసీఆర్‌ అంటూ కల్వకుంట్ల కవిత తన ప్రెస్‌మీట్‌ ముగించడం విశేషం.