బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ చేయబడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన కూడా వెలువడింది. దీనిపై ఆమె ఇంకా స్పందించాల్సి ఉంది.
ఈలోగా పార్టీ సీనియర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవిత వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని మేము భావిస్తున్నాము. ఆమె ద్వారా కల్వకుంట్ల కుటుంబంలో, పార్టీలో చిచ్చు రగిలించి ముక్కలు చేయాలని కుట్ర జరుగుతున్నట్లు మేము అనుమానిస్తున్నాము.
పార్టీలో ఎంత పెద్దవారైనా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే. అధినేత కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. కల్వకుంట్ల కవిత ఆ హద్దులన్నీ దాటేశారు కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు,” అని అన్నారు.
తాజా సమాచారం ఆమె పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బహుశః ఈరోజు లేదా రేపు మీడియా ముందుకు వచ్చి ఆమె తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.