సీబీఐ విచారణ వద్దు: హైకోర్టు

తెలంగాణ హైకోర్టు నేడు ఊహించని విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కమీషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులకు ఇది చలా ఉపశమనం కలిగించేదే. ముఖ్యంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని ఆదేశించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి బ్రేకులు వేసిందని చెప్పవచ్చు. 

కానీ ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్ జనరల్ కమీషన్ నివేదిక ఆధారంగా ఈ కేసుని సీబీఐకి అప్పగించడం లేదని, శాసనసభలో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని హైకోర్టుకి తెలిపారు. కనుక ఈ కేసుని సీబీఐ కమీషన్ నివేదిక ఆధారంగా కాక మళ్ళీ మొదటి నుంచి విచారణ జరుపుతుందని, దీని కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ నివేదికతో పాటు అన్ని సాక్ష్యాధారాలను పరిశీలిస్తుందని హైకోర్టుకి తెలియజేశారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.