ఈరోజు (ఆదివారం) సాయంత్రం శాసనసభలో కాళేశ్వరం నివేదికపై చర్చ ప్రారంభమైంది. సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నాడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి ప్రాణహిత-చేవెళ్ళలో 205 టిఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయని కనుక అక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ 2014లోనే ఈ లేఖ పంపారు.
కానీ కేసీఆర్ కమీషన్ల కోసం ఆ లేఖను పక్కన పడేసి నిపుణుల సలహాలు పట్టించుకోకుండా లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అంత ఖర్చు చేసి నిర్మించిన ఆ ప్రాజెక్టులో ఆయన హయంలోనే నీళ్ళు నింపితే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఆ తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ బృందం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, సుందిళ్ళ బ్యారేజీలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని మరమత్తులు చేయకుండా నీళ్ళు నింపితే కూలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
ఇంత జరిగినా మాజీ జలవనరుల మంత్రి హరీష్ రావు సభని, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన ప్రతీ పొరపాటుకి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. కమీషన్ కూడా అదే తేల్చి చెప్పింది,” అంటూ మంత్రి హోదాలో హరీష్ రావు, కేంద్ర ప్రభుత్వంతో, అధికారులతో, నిపుణుల కమిటీలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను శాసనసభ్యులకు చూపించారు.
సాయంత్రం 7 గంటలకు శాసనసభలో ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీనిపై నేడే చర్చ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.