ఈరోజు (ఆదివారం) సాయంత్రం శాసనసభలో కాళేశ్వరం నివేదికపై చర్చ ప్రారంభమైంది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది. ఇదో పెద్ద రాజకీయ డ్రామా తప్ప మరేమీ కాదు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ మా పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తోంది.
త్వరలో పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నందున ఇప్పుడూ అదే చేస్తోంది. మేము ఈ నివేదికపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తే, న్యాయస్థానం ఎక్కడ అడ్డుపడుతుందోనని ఈరోజు హడావుడిగా శాసనసభలో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు, యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవేమీ పట్టన్నట్లు కాళేశ్వరం నివేదికపై చర్చిస్తోంది. మీరు ప్రభుత్వం నడుపుతున్నారా లేదా డ్రామా కంపెనీ నడుపుతున్నారా?” అని హరీష్ రావు ప్రశ్నించారు.