నేడు కేరళకు వెళ్ళి రానున్న సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలైన ఈ సమయంలో సిఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ వెళ్ళనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్స్ పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తోంది. కనుక ఈరోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో దీనికి సంబందించిన పంచాయితీరాజ్, మునిసిపల్ చట్ట సవరణ బిల్లుతో పాటు కాళేశ్వరం కమీషన్ నివేదికని శాసనసభలో ప్రవేశపెడతారు. 

ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళలో కొచ్చికి బయలుదేరుతారు. కొచ్చి నుంచి హెలికాఫ్టర్‌లో ఆలెప్పి చేరుకొని అక్కడ కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 

అది పూర్తికాగానే మళ్ళీ హెలికాఫ్టర్‌లో కొచ్చి విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం సుమారు 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శాసనసభకు వచ్చి సమావేశంలో పాల్గొంటారు. 

సిఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమీషన్ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారు.