నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10.30 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు మొదలవగానే ముందుగా ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత ఉభయ సభల సమావేశాలు వాయిదా వేసి ఆనవాయితీ ప్రకారం బీఏసీ కమిటీ సమావేశం నిర్వహించి ఉభయసభల సమావేశాల అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు.
కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కనుక ప్రధాన అజెండా ఇదే ఉంటుంది.
ఇదిగాక బీసీ రిజర్వేషన్స్ పెంపు విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి కూడా చర్చించానున్నారు. వీలైతే శాసనసభ డెప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహించే అవకాశం ఉంది. కనుక వీటి కోసం నాలుగైదు రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమావేశాలలో మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా గత ప్రభుత్వంలో పలువురు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కమీషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దాని ఆధారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనలు వినిపించి ఆ తర్వాత చట్టపరమైన చర్యలకు సిద్దం కాబోతోంది. కనుక బీఆర్ఎస్ పార్టీ వారిని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక ఈసారి శాసనసభ సమావేశాలు చాలా వాడివేడిగా సాగే అవకాశం ఉంది.