తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు త్వరలో తీరనున్నాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నేడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “యూరియా కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఒకటి రెండు రోజులలో 21,325 టన్నుల యూరియా రాబోతోంది. ఆ తర్వాత మరో పది వారం రోజులలో మరో 29,700 టన్నుల యూరియా రాష్ట్రానికి రాబోతోంది.
ముందుగా గద్వాల్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్ళపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డి పల్లి వద్ద ఈ యూరియా సరఫరా చేస్తాము. సెప్టెంబర్ మొదటి వారంలో విదేశాల నుంచి గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టులకు యూరియా వస్తుంది. దానిని కూడా రాష్ట్రంలో జిల్లాల అవసరాలను బట్టి పంపిణీ చేస్తాము. రెండు విడతలలో కలిపి 51,025 టన్నుల యూరియా రైతులకు అందిస్తాము,” అని మంత్రి తుమ్మల చెప్పారు.