ఆరు నెలలు సెలవుపై వెళ్తున్న స్మితా సభర్వాల్

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్ ఆరు నెలలు సెలవు తీసుకోబోతున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఆమె శిశు సంరక్షణ కోసం సెలవుకి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదించింది.

ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్‌ సుల్తానియా గురువారం జీవో విడుదల చేశారు. ఆమె సెలవు నుంచి తిరిగి వచ్చే వరకు ఐఏఎస్‌ అధికారిణి పి.కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

ప్రభుత్వం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఈవిదంగా లాంగ్ లీవ్ తీసుకోవడం సర్వ సాధారణమే. కానీ కంచె గచ్చి బౌలి భూముల విషయంలో ఆమె సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ పార్టీ పెట్టిన పోస్టులను రీట్వీట్ చేయడం, వాటిపై ప్రభుత్వం సంజాయిషీ కోరినప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలోనే ఘాటుగా పోస్టులు పెట్టడం వంటివి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారాయి.

కాళేశ్వరం కమీషన్ ఎదుట ఆమె కూడా విచారణకు హాజరయ్యి వివరణ ఇచ్చుకున్నారు. కనుక ఇప్పుడు ఆమె ఆరు నెలలు దీర్గ కాల సెలవుపై వెళుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.