బీజేపి ఎంపీ రఘునందన్ రావు ఈరోజు హైదరాబాద్లో డిజిటల్ మీడియా చట్టాలు-అవగాహన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నప్పుడు మీడియా మిత్రులకు ఓ విజ్ఞప్తి చేశారు. క్రిమినల్ వార్తలు వ్రాసేటప్పుడు లేదా ప్రసారం చేసేటప్పుడు వాటిని సంచలన వార్తలుగా మార్చే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
ఒక హత్య జరిగితే అంతవరకే వార్త ఉండాలి తప్ప ఆ హత్య ఎప్పుడు ఏవిదంగా జరిగింది? చనిపోయిన వ్యక్తిని ఏవిదంగా ముక్కలుముక్కలుగా నరికారు? ఏవిదంగా ఫ్రిజ్లో దాచారు?వంటివన్నీ వ్రాయడం మానుకోవాలని హితవు పలికారు.
ఇటీవల కూకట్పల్లిలో ఓ మైనర్ బాలుడు, పక్కింట్లో మైనర్ బాలికని హత్య చేసినప్పుడు, దాని గురించి మీడియా ప్రచురించిన కధనాలను రఘునందన్ రావు తప్పు పట్టారు. మీడియా ఈవిదంగా ఓ క్రిమినల్ వార్తని సంచలనంగా మార్చుతుండటం వల్లనే వాటిని చూసి మరింత మంది నేర్చుకుంటున్నారని రఘునందన్ రావు అన్నారు.
సమాజంలో ఇప్పటికే చాలా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని, మీడియా ప్రచురిస్తున్న ఇటువంటి కధనాలతో పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందన్నారు. కనుక నేర వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని రఘునందన్ రావు హితవు పలికారు.
అలాగే సెలబ్రేటిల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టడం మంచిది కాదన్నారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని అది మీడియా కూడా దాటకూడదని రఘునందన్ రావు హితవు పలికారు. నిజమే కదా?