బీహార్‌లో సిఎం రేవంత్, మంత్రులు ప్రచారం!

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బీహార్‌ పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఈ అక్టోబర్-నవంబర్ మద్య బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళకు తలొగ్గిన కేంద్ర ఎన్నికల కమీషన్ ‘సర్’ పేరుతో లక్షలాది ఓట్లు తలగించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ యంపీ రాహుల్ గాంధీ బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్నారు.

దానిలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిం రెడ్డి బీహార్‌ బయలుదేరి వెళ్ళారు. ఈరోజు ఉదయం రాహుల్ గాంధీతో కలిసి‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ నేతల బీహార్‌ యాత్రపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ స్పందిస్తూ, “ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఓ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. బీహార్‌ శాసనసభ ఎన్నికల కోసమే ఈ డ్రామా ఆడుతోంది. 

కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత, ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకే ముఖ్యం. రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించి వారి ఓట్లతో ఎన్నికలలో గెలవాలనుకుంటోంది. దాని ప్రయత్నాలను ఈసీ అడ్డుకున్నందుకే ఈ ‘ఓటు చోరీ’ అంటూ డ్రామాలు మొదలుపెట్టింది. ఇదివరకు బీఆర్ఎస్‌ పార్టీ ఇటువంటి డ్రామాలు ఆడేది ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆడుతోంది.. అంతే!” అన్నారు.