సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన విద్యార్ధులు వసతి గృహం (హాస్టల్) ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్ధులను ఉద్దేశ్యించి చాలా స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
విద్యార్ధులు గంజాయి, మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యవసనాలకు దూరం ఉండాలన్నారు. కేవలం విద్యతోనే జీవితంలో రాణించగలమన్నారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ఉద్యమ స్పూర్తి రగిలించిన జార్జిరెడ్డి, గద్దర్ వంటి హేమాహేమీలు అందరూ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవారేనని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
చిన్నవయసులోనే ఐపీఎస్ పూర్తిచేసిన సీవీ ఆనంద్, టీజిపీఎస్సీ చైర్మన్ అయిన బుర్రా వెంకటేశం వంటివారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్ధులు చక్కగా చదవుకొని జీవితంలో రాణించాలన్నారు. ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ అలవాటు పడితే జీవితం నాశనం అయిపోతుందని ప్రతీ విద్యార్ధి గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమాలు చల్లబడుతున్నప్పుడు శ్రీకాంతాచారి, యాదయ్య బలి దానాలతో ఉద్యమ స్పూర్తి రగిలించి తెలంగాణ సాధనకు తోడ్పడ్డారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో అవిభక్త కవలలు వంటివని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో ఆనాడు ఉస్మానియా విద్యార్ధులు తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటాలను సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే, బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయలు ఖర్చు చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ పదవి ఊడగొట్టిందన్నారు. ఆయనకు మళ్ళీ రెండు వారాలలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ సాధనకు ఇంతగా తోడ్పడిన ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన గత ప్రభుత్వం పదేళ్ళుగా పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉస్మానియా అభివృద్ది పనులు ప్రారంభించిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే ఉస్మానియా కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడబోమన్నారు.
విద్యార్ధులకు ఏ సమస్యలు వచ్చిన తాను, మంత్రులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నేరుగా తమని కలిసి మాట్లాడవచ్చని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ ఉచ్చులో పడకుండా విద్యార్ధులు కేవలం చదువులపైనే దృష్టి పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు.