వచ్చే నెల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు

హైకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇదే ప్రధాన అజెండాగా ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో మంత్రివర్గ ఉప కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ న్యాయ నిపుణుల సలహా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్స్‌ అంశంపై ఏవిదంగా ముందుకు సాగాలనే నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా 29న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.      

బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ కల్పించే ఆర్డినెన్స్‌కి రాష్ట్రపతి ఆమోదం లభించనందున, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మంత్రివర్గం బీసీ రిజర్వేషన్స్‌ ఖరారు చేసి ఆమోదం తెలిపితే ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్దంగా ఉంది. కనుక వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.