సీపీఐ సురవరం సుధాకర్ రెడ్డి మృతి

సీనియర్ వామపక్ష నాయకుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్ను మూశారు. గత కొంతకాలంగా వృదాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన శుక్రవారం సాయంత్రం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

ఆయనకు భార్య డాక్టర్ బివి. విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురవరం విద్యార్ధి దశ నుంచి వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. మూడుసార్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒకసారి ఎంపీగా చేశారు.  సురవరం సుధాకర్ రెడ్డి స్వస్థలం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామం. కర్నూలు పాఠాశాలలో 9వ తరగతి చదువుతున్నప్పుడే 15 ఏళ్ళ వయసులో విద్యార్ధుల సమస్యలపై నిరసన తెలియజేశారు. అప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ వరకు ప్రతీ దశలో ఆయన ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూనే ఉన్నారు. 

1988లో నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించి పార్లమెంటులో ఆడుగుపెట్టారు. 2004లో మళ్ళీ నల్గొండ నుంచే పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమాలలో సిపిఎం పార్టీ పాల్గొనడానికి ప్రధాన కారణం సురవరం సుధాకర్ రెడ్డే. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే రాష్ట్ర విభజన తప్ప మరో మార్గం లేదని పార్టీని ఒప్పించి ఉద్యమంలో భాగస్వామిని చేశారు. 

సురవరం సుధాకర్ మృతి పట్ల ఏపీ , తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్‌, సీపీఎం, సిపిఐ నేతలు తదితరులు సంతాపం తెలిపారు. 

ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు నివాళులు అర్పించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు అందజేస్తారు.