కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదికని కొట్టివేయాలని, దాని ఆధారంగా ప్రభుత్వం తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిపై ఈరోజు కూడా విచారణ జరిగింది.
ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పీసీ ఘోష్ కమీషన్ని ప్రతివాదులుగా పేర్కొన్నందున హైకోర్టు వారు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. మళ్ళీ వారి కౌంటర్లపై స్పందించడానికి పిటిషనర్లకు ఒక వారం గడువు ఇస్తూ ఈ కేసు తదుపరి విచారణని 5 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
కాళేశ్వరం కమీషన్ నివేదికని ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి హైకోర్టుకి తెలియజేసినందున, అంతవరకు కేసీఆర్, హరీష్ రావులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు. కనుక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కమీషన్ నివేదికని ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టి బహిర్గతం చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. తక్షణం దానిని ఆన్లైన్లో నుంచి తొలగించాలని ఆదేశించింది.