కాళేశ్వరం: ఏకపక్ష నిర్ణయం కాదు: కేసీఆర్‌ న్యాయవాది

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఇచ్చిన నివేదికని కొట్టివేయాలంటూ మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.

దానిపై విచారణ జరిపినప్పుడు, కేసీఆర్‌ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు వాదిస్తూ, “కాళేశ్వరం నిర్మించాలనేది కేసీఆర్‌ సొంత నిర్ణయం కాదు. మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇంజనీర్ల కమిటీ నివేదిక ప్రకారమే నిర్మించారు. అందరితో చర్చించి అందరి సమ్మతితోనే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది.

ఇది ఏకపక్ష నిర్ణయం కానే కాదు. దీనిపై విచారణ జరిపిన జ్యూడిషియల్ కమీషన్ తన పరిధిని అతిక్రమించింది. ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచి నివేదికలో నిందితుడుగా పేర్కొనడం సరికాదు. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నప్పుడు, వారు చేపుతున్నవి నిజామా కాదా అని తెలుసుకునేందుకు కేసీఆర్‌కి అవకాశం కల్పించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనకాడని కేసీఆర్‌ని అప్రదిష్టపాలు చేసేందుకు రాజకీయ దురుదేశ్యంతోనే ఈ కమీషన్ పేరుతో ఇటువంటి నివేదిక తయారుచేయించారు. కనుక దానిని రద్దు చేయాలి,” అని వాదించారు. 

ఈ నివేదికపై శాసనసభలో చర్చించబోతోందని, కనుక పిటిషనర్లు (కేసీఆర్‌, హరీష్ రావు) ఆ చర్చలో పాల్గొని తమ వాదనలు వినిపించవచ్చని ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి హైకోర్టుకి తెలియజేశారు.

ఆ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు తదుపరి విచారణని నేటికి వాయిదా వేసింది.