తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తాను లేని ఈ సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తనను తొలగించి, కొప్పుల ఈశ్వర్‌ని నియమించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“నేను నా తండ్రి కేసీఆర్‌కి వ్రాసిన లేఖను పార్టీలో ఎవరు మీడియాకు లీక్ చేశారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే, వారిపై చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఈవిదంగా చేయడం చాలా బాధాకరం.
సింగరేణి కార్మికుల కోసం నేను పోరాడుతుంటే నాకు వ్యతిరేకంగా పార్టీలో కొందరు ఈవిదంగా కుట్రలు చేస్తున్నారు. పార్టీలో ఎవరు ఈ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు. వారిపై చర్యలు తీసుకోమని అడిగితే మళ్ళీ నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. నాపైనే పార్టీ అధిష్టానం కక్ష కట్టడం చాలా బాధాకరం.
నేను టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఉండగా నా ప్రమేయం లేకుండానే నా స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ని నియమించడం సరికాదు.
ముఖ్యంగా కార్మిక చట్టాల ప్రకారం జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కార్మికుల సమ్మతితో అధ్యక్షుడుని ఎన్నుకోవాలి. కానీ అందుకు విరుద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడుని ఖరారు చేశారు.
ఏది ఏమైనప్పటికీ టిబిజికెఎస్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, “ అంటూ అమెరికా నుంచి కల్వకుంట్ల కవిత ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.