జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సన్నాహాలు షురూ

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. దీని కోసం ఈసీ నిన్న సమ్మరీ రివిజన్ షెడ్యూల్ విడుదల చేసింది. 

ముందుగా ఇవాళ్ళ (గురువారం) రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యి ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తుంది. 

ఆనవాయితీ ప్రకారం ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో కొత్తగా ఓటు హక్కు పొందేవారిని గుర్తించి నమోదు చేయాల్సి ఉంటుంది. కనుక జూలై 1 నాటికి 18 ఏళ్ళు దాటినవారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయాలని నిర్ణయించింది. 

సెప్టెంబర్‌ 2 నుంచి 17 వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై అభ్యంతరాలను స్వీకరించి 25 నాటికి పరిష్కరించాలని నిర్ణయించింది. ఇది పూర్తి కాగానే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌ మద్య బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక వాటితో పాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నిర్వహించవచ్చు.