కల్వకుంట్ల కవితకి బీఆర్ఎస్‌ పార్టీ షాక్

బీఆర్ఎస్‌ పార్టీ అనుబంధ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్‌)లో కలకలం మొదలైంది. సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం ఆ పదవిలో నుంచి తొలగించింది. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ని నియమించింది. 

దీనిపై టిబిజికెఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంఘం నుంచి రాజీనామాలు చేస్తున్నారు. సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవితక్క ఇక్కడ లేదు. ఆమె అమెరికా వెళ్ళినప్పుడు గుట్టుగా ఈ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏమిటి?అసలు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండా, కనీసం మాతో మాట మాత్రంగానైన చెప్పకుండా బీఆర్ఎస్‌ పార్టీ ఈ నిర్ణయం ఎలా తీసుకుంది?

ఆమెపై బీఆర్ఎస్‌ అధిష్టానం ఈవిదంగా కుట్రలు ఎందుకు చేస్తోంది. ఇంటి ఆడబిడ్డతో ఇలాగేనా వ్యవహరించేది? బీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా మేము సంఘం సభ్యత్వానికి రాజీనామాలు చేస్తున్నాము. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ‘బాయి బాట’ పేరుతో సింగరేణిలో అన్ని ప్రాంతాలలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి, కల్వకుంట్ల కవితక్కకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తెలియజేస్తాం,” అని అన్నారు.