సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వం: కేటీఆర్‌

జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయన తెలంగాణకు చెందినవారు, తెలుగు వ్యక్తి కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని సిఎం రేవంత్ రెడ్డి నిన్న విజ్ఞప్తి చేశారు. 

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి అడిగారు కనుకనే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మేము మద్దతు ఇవ్వదలచుకోలేదు. ఈ పదవికి తెలంగాణలో బీసీలలో ఎవరూ కనపడలేదా?అయినా ఇంతవరకు మమ్మల్ని ఏ కూటమి మద్దతు ఇవ్వాలని కోరలేదు. ఒకవేళ కోరినా ఇచ్చే ప్రసక్తి లేదు. కాంగ్రెస్‌, బీజేపిలు రెండూ ఉప రాష్ట్రపతి ఎన్నిక పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. 

తెలంగాణ రైతులకు ఎవరు యూరియా ఇస్తారో వారికే మా మద్దతు. తెలంగాణలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే ఈ దద్దమ్మ ప్రభుత్వానికి పట్టడం లేదు. అదే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఆరు నెలల ముందుగానే యూరియా స్టాక్ తెప్పించి గోదాముల్లో సిద్దంగా ఉంచేవారు. 

కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చాక రైతులు యూరియా కోసం గోదాముల వద్ద పగలు రాత్రి తేడా లేకుండా క్యూలైన్లలో నిలబడుతున్నారు. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కోసం చెప్పులు, పాసు పుస్తకాలతో క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పోలీసులను కాపలాగా పెట్టి యూరియా బస్తాలు అమ్ముకునే దుస్థితి నెలకొంది.

రాష్ట్రంలో రైతులు ఇన్ని అగచాట్లు పడుతున్నా ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు. యూరియా కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారు,” అంటూ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.