తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరూ మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రతిష్టని తద్వారా రాజకీయంగా తమని దెబ్బ తీయాలనే దురుదేశ్యంతోనే పీసీ ఘోష్ కమీషన్ ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు.
కమీషన్ కూడా ప్రభుత్వం కోరిన విధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తాము అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక తయారుచేసి ఇచ్చిందని పేర్కొన్నారు. కనుక రాజకీయ దురుదేశ్యంతో జరిపించిన ఈ విచారణ సరికాదని, పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదికని రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుని అభ్యర్ధించారు.
కమీషన్ నివేదిక కాపీలు ఈయవలసిందిగా తాము లిఖిత పూర్వకంగా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇవ్వకుండా, దానిలో పేర్కొన్న విషయాలను మీడియాకు లీకులు ఇవ్వడం మా పరువు ప్రతిష్టలను దెబ్బ తీయాలనే రాజకీయ దురుదేశ్యంతో చేసినదిగానే భావిస్తున్నాము.
పీసీ ఘోష్ కమీషన్ 2014 నుంచి 2023 వరకు మా హోదాలు, మా నిర్ణయాలను పరిశీలించడం, వాటి ఆధారంగా నివేదికని రూపొందించడం కమీషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్ట విరుద్దం. కనుక పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదికని రద్దు చేయాలి,” అని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుని అభ్యర్ధించారు.
ఈ కేసులో వారు ప్రతివాదులుగా పీసీ ఘోష్ కమీషన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సాగునీటిశాఖ ముఖ్య కార్యదర్శిని పేర్కొన్నారు.