తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఉప రాష్ట్రపతి పదవికి జరుగబోతున్న ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్ధిగా తెలుగువారైన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, “ఓ తెలుగువాడికి ఇటువంటి అత్యున్నత పదవి చేపట్టే అవకాశం లభించడం తెలుగువారి అందరి అదృష్టం. కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆయనేమీ మా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కారు. కాంగ్రెస్ అభ్యర్ధి కూడా కారు. ఇండియా కూటమిలో అన్ని పార్టీల తరపున పోటీ చేస్తున్నారు.
గతంలో పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు అయన నంద్యాల లోక్ సభ నుంచి ఉపఎన్నికలో పోటీ చేస్తుంటే, తెలుగువారైన ఆయనని మనమందరం కలిసి గెలిపించుకోవాలని ఎన్టీఆర్ ఆయనపై ఎవరినీ పోటీ పెట్టకుండా సహకరించారు.
ఇప్పుడు మనమందరం కూడా అదే స్పూర్తితో మన తెలుగు వారైన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలి. ఆయనని ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా చేసుకుంటే భవిష్యత్తులో అయన రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అటువంటి న్యాయకోవిదుడైన వ్యక్తి దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉంటె మన అందరికీ గౌరవం. గర్వ కారణంగా ఉంటుంది. కనుక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవలసిన బాధ్యత మన తెలుగు వారందరిపై కూడా ఉంది.
ఈ సందర్భంగా ఏపీ సిఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అందరికీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.