ఎన్డీయే, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధులు వీరే...

సెప్టెంబర్‌ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగబోతోంది. ఎన్డీయే అభ్యర్ధిగా చంద్రాపురం పొన్నుస్వామి రాదా కృష్ణన్‌ (సీపీ రాధాకృష్ణన్) పేరు ఖరారు చేశారు. ఇండియా కూటమి అభ్యర్ధిగా మన తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. 

రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనేక సమస్యలకు ఎదురీదుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, 2007 జనవరి నుంచి నాలుగేళ్ళపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పనిచేశారు.  

సీపీ రాధాకృష్ణన్‌కి అయన 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపి మాజీ  అధ్యక్షుడుగా పనిచేశారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు. సీపీ రాధాకృష్ణన్‌కి ఆర్‌ఎస్ఎస్‌, బీజేపిలతో దశాబ్దాలుగా అనుబందం ఉన్న కారణంగా ఎన్డీయే అభ్యర్ధిగా అవకాశం లభించిందని భావించవచ్చు. 

పార్లమెంటు ఉభయ సభలలో కలిపి ఎన్డీయేకి మొత్తం  426 సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 309 మంది మాత్రమే ఉన్నారు. కనుక ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంచనప్రాయమే.