కాళేశ్వరం కూల్చేలని కాంగ్రెస్‌, బీజేపిలు కుట్ర: ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్‌, బీజేపిలపై సంచలన ఆరోపణలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి, “తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీని ఓడించి కేసీఆర్‌ని గద్దె దించడానికి కాంగ్రెస్‌, బీజేపిలు కలిసి కుట్ర చేశాయి. 

ఎన్నికలకు రెండు నెలల ముందు అంటే 2023 అక్టోబర్, 21న మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద భారీ శభ్దాలు వినిపించాయని ఆ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్‌ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో మర్నాడు పిర్యాదు చేశారు. 

పిల్లర్లు క్రుంగితే అటువంటి శబ్దాలు రావు. కనుక ఆ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్‌, బీజేపిలే ఈ కుట్రకు పాల్పడ్డాయని అనుమానం కలుగుతోంది. 2022లో పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేస్తే ఇంత వరకు ఎందుకు విచారణ జరుపలేదు? 

ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి ఓ లేఖ వ్రాయగానే జాతీయ డ్యామ్స్ సేఫ్టీ అధారిటీ బృందం వెంటనే వచ్చి వాలిపోయింది. కానీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మొత్తం డ్యామ్‌ కొట్టుకుపోయినా వెళ్ళలేదు. మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లను ఎవరో బాంబులతో పేల్చేసి కూల్చేయాలని కుట్ర చేశారు. ఇప్పటికైనా దానిపై విచారణ జరిపిస్తే నిందితులు ఎవరో ప్రజలకు తెలుస్తుంది,” అని ప్రవీణ్ కుమార్ అన్నారు. 

ఆయనకు సీనియర్ కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. “మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కృంగిన తర్వాత రెండు నెలలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు కూడా నమోదు చేశారన్నారు కదా? మరి అప్పుడే ఎందుకు విచారణ ఎందుకు జరిపించలేదు?

కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా ప్రాజెక్ట్ నిర్మించడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగిపోయింది. దానిని కప్పిపుచ్చుకునేందుకు రెండేళ్ళ తర్వాత ఈ కొత్త స్టోరీ చెపుతున్నారు,” అని అద్దంకి దయాకర్ ఆక్షేపించారు.