తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “చాలా మంది నన్ను అడుగుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా?గతంలో, ఇప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవచ్చు కదా?అని. కానీ ఈ ముఖ్యమంత్రి పదవి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు. ప్రజలకు, రాష్ట్రానికి సేవ చేసేందుకు లభించిన ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను ఎవరినీ శత్రువులుగా భావించను. కానీ నన్ను శత్రువుగా భావించేవారు చాలా మందే ఉన్నారు. ఒకవేళ నేను ఎవరితోనైనా పోరాడాలన్నా అవతలి వ్యక్తికి నాకు తగిన స్థాయి కలిగి ఉండాలి. నా కంటే తక్కువ స్థాయి రాజకీయ నాయకులతో కీచులాడుతూ నేను నా స్థాయిని తగ్గించుకోను,” అని అన్నారు.
తెలంగాణ ఉద్యమాలని కొందరు రాజకీయాలకు పెట్టుబడిగా వాడుకుంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న చాలామంది ఆ తర్వాత వాటి గురించి చెప్పుకోకుండా తెర మరుగు అయిపోతే కేసీఆర్ తదితరులు మాత్రం ఆ పేరుతో రాజకీయాలలో ఎదిగి లక్షల కోట్ల ఆస్తులు, ఫామ్హౌసులు, సొంత పత్రికలూ, టీవీ చానల్స్ సంపాదించుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం, నష్టం చేస్తూనే ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.