మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాపై రాజకీయకక్షతో వరద నీటిని వృధాగా సముద్రంలోకి విడిచిపెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేస్తే మిడ్ మానేరులో మరో 20 టీఎంసీలు నీళ్ళు నింపుకోవచ్చు.
ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు తోడుకోవచ్చు. దాని చుట్టుపక్కల అనేక రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయి. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని నిరూపించేందుకు నీటిని తోడకుండా దిగువకు వదిలేస్తున్నారు. రోజుకి సుమారు 60,000 క్యూసెక్కుల నీటిని వృధా చేస్తున్నారు.
ఎల్లంపల్లిలో ఏడు మోటర్లు ఉంటే వాటిలో రెండింటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు? మిగిలినవి కూడా ఆన్ చేసి నీళ్ళు తోడిపోయవచ్చు కదా? ఇప్పుడు వరద నీటిని తోడి పోసుకోకపోతే వచ్చే వేసవికి పంటలకు నీళ్ళు ఉండవు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బురద రాజకీయాలు చేయడం మానుకొని తక్షణం మోటార్లు అన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మేమే రైతులను వెంటపెట్టుకొని వెళ్ళి పంప్ హౌసులలో మోటార్లు ఆన్ చేస్తాము,” అని హరీష్ రావు అన్నారు.