ఈ నెలాఖరు నుంచే ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ!

తెలంగాణలో ‘ఇందిరమ్మ ఇళ్ళ’ కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ఓ శుభవార్త. ఆగస్ట్ నెలాఖరులోగా సిఎం రేవంత్ రెడ్డి ఈ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లలో చంద్రుగొండ మండలంలో బెండలపాడు గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన 44 ఇళ్ళని సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న ప్రారంభోత్సవం చేసి లబ్దిదారులకు అందజేస్తారు. అదే రోజున లబ్దిదారులు వాటిలో గ్రుహాప్రవేశాలు చేస్తారు. మరో వారం రోజులలోనే ఈ కార్యక్రమం ఉంది కనుక అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇవి కాక రాష్ట్రంలో మరో 4,000 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. కనుక వాటిని కూడా ఈ నెలాఖరు నుంచి లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు పనులు వేగవంతం చేయించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.13 లక్షల ఇళ్ళని లబ్దిదారులకు కేటాయించగా వాటిలో గోడల నిర్మాణ దశలో 10,000 ఇళ్ళు, పునాది దశలో 85,000 ఇళ్ళు, గ్రౌండింగ్ దశలో 1.96 లక్షల ఇళ్ళున్నాయి.