కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కనుక నేడో రేపో వారందరూ రాజీనామాలు చేయక తప్పదని, కనుక ఆ 10 స్థానాలకు ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా.
కేసీఆర్ సూచన మేరకు కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టి రాజకీయంగా పైచేయి సాధించామని బీఆర్ఎస్ పార్టీ నేతలు సంతోషపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఓ బాంబు పేల్చింది.
త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అవబోతున్నారని తెలియజేస్తూ ఓ పొలిటికల్ కార్టూన్ పోస్ట్ చేసింది. దానిలో మెడకు గొలుసులు బందించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఆ గొలుసు కేసీఆర్ చేతిలో ఉంది. ఒకవేళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుంది.