త్వరలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన?

మాజీ సిఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలో ఢిల్లీ బయలుదేరబోతున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో కేసు వేస్తామని చెప్పారు.

ఆ కేసు గురించి న్యాయవాదులతో మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు సమాచారం. కానీ కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళబోతుండటం నిజమైతే అందుకు అది ఒక సాకు మాత్రమే అని అందరికీ తెలుసు. 

తెలంగాణ ప్రభుత్వం త్వరలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చ పెట్టబోతోంది. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా కొలిక్కి వచ్చింది.

ఇప్పటికే బండి సంజయ్‌తో సహా వివిధ పార్టీలలోని బాధితుల వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. కనుక త్వరలోనే ఈ కేసు కూడా నమోదు చేసి కేసీఆర్‌కి నోటీసులు పంపే అవకాశం ఉంది. కనుక ఈ రెండు కేసులను ఏవిదంగా ఎదుర్కోవాలని ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించేందుకు వెళుతుండవచ్చు. 

కానీ ఈ కేసుల నుంచి పూర్తిగా ఉపశమనం లభించాలంటే తప్పనిసరిగా బీజేపి పెద్దల సహాయ సహకారాలు అవసరం. అందుకోసమే కేసీఆర్‌ ఢిల్లీ వెళుతుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళి వస్తే తప్పకుండా రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది.