ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమాణాల ఎపిసోడ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మద్య హెచ్చరికలు, సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం దేవుళ్ళపై ప్రమాణాల ఎపిసోడ్ నడుస్తోంది. 

కేటీఆర్‌ తనని కోర్టుకీడుస్తానంటూ హెచ్చరించడంపై బండి సంజయ్‌ కూడా తీవ్రంగా స్పందించారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేవాడిని కాను. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అంటున్నావు కనుక నువ్వు, మీ తండ్రి కేసీఆర్‌ని మీ భార్య పిల్లలని వెంటపెట్టుకొని గుడికి రా. నేను కూడా భార్య పిల్లలని వెంటపెట్టుకొని గుడికి వస్తాను. 

అందరం దేవుడు ఎదుట ప్రమాణాలు చేద్దాము. నీకు, నీ తండ్రికి ఫోన్ ట్యాపింగ్‌తో ఎటువంటి సంబంధమూ లేదని దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా? మేము చేస్తాము. నువ్వు ఏ గుడికి అంటే ఆ గుడికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాము. నా సవాలు స్వీకరించే దమ్ముందా కేటీఆర్‌? 

నువ్వు నీ తండ్రి, తాత పేరు చెప్పుకొని రాజకీయాలలో ఈ స్థాయికి ఎదిగావు. కానీ నేను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చాను. కనుక నీ బెదిరింపులకు భయపడను,” అని బండి సంజయ్‌ అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మళ్ళీ కేసీఆర్‌, కేటీఆర్‌లపై అవే ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ళు తదితర కేసులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు, కేసీఆర్‌ నెలానెలా కాంగ్రెస్‌ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తూనే ఉన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. 

లేకుంటే ఈపాటికి వారిని రేవంత్ రెడ్డి ఎప్పుడో అరెస్ట్‌ చేసి ఉండేవారని బండి సంజయ్‌ అన్నారు. కాళేశ్వరం కమీషన్ నివేదికని శాసనసభలో ప్రవేశపెడతానని చెపుతున్న రేవంత్ రెడ్డి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కమీషన్ రిపోర్టుని ఎందుకు దాచి పెట్టిందని ప్రశ్నించారు. 

ఇంతవరకు ఆ నివేదికని శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య ఎంత బలమైన బంధం ఉందో అర్ధమవుతోందన్నారు.  కేసీఆర్‌, కేటీఆర్‌లని కాంగ్రెస్‌ అధిష్టానమే కాపాడుతోందని బండి సంజయ్‌ ఆరోపించారు.