కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు ఫోన్లు తప్ప మిగిలిన అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్లకు భయపడి హరీష్ రావు చాలా రోజులు సొంత ఫోన్ వాడటం మానేశారు.
సొంత కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నేతల ఫోన్లే కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తున్నప్పుడు మాలాంటివారిని విడిచి పెడతారా? నాది, నా భార్యది, మా బంధుమిత్రులు, చివరికి మా పనివాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారు. భార్యాభర్తల మాటలను కూడా రహస్యంగా వినడానికి సిగ్గనిపించలేదు.
కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారుల నుంచి బాగానే సంపాదించుకున్నారు,” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బండి సంజయ్ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఓ కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈవిదంగా చిల్లర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు. మాపై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపించాలి. లేదా 24 గంటలలో బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేకుంటే కోర్టుకీడుస్తానంటూ’ హెచ్చరించారు.
కేటీఆర్ హెచ్చరికపై బండి సంజయ్ ఇంకా స్పందించవలసి ఉంది.