సచివాలయంలో హరీష్ రావు?

ఒకప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజూ సచివాలయానికి వెళుతుండేవారు. కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి సచివాలయంలో అడుగే పెట్టలేదు. సుమారు 20 నెలల తర్వాత శుక్రవారం సచివాలయంలో అడుగుపెట్టారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని కలిసేందుకు ఈరోజు సచివాలయానికి వెళ్ళారు. ఇటీవల పీసీ ఘోష్ కమీషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నివేదిక అందించింది. దానిపై చర్చించేందుకు త్వరలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ సమావేశాలలో బీఆర్ఎస్‌ పార్టీతో సహా అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ తమ తమ అభిప్రాయలు వినిపించవచ్చని చెప్పారు.

కనుక కాళేశ్వరం కమీషన్ ఇచ్చిన ఆ నివేదికని అధ్యయనం చేసేందుకు తమకు రెండు కాపీలు ఈయవలసిందిగా హరీష్ రావు లిఖిత పూర్వకంగా కోరారు.

ఒకటి కేసీఆర్‌కి, మరొకటి తనకి కావాలని రెండు వినతి పత్రాలు రామకృష్ణారావుకి ఇచ్చారు. వారి అభ్యర్ధనని పరిశీలించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పి పంపారు.

హరీష్ రావు వెంట బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, దేశపతి శ్రీనివాస్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ సచివాలయానికి వెళ్ళారు.