తెలంగాణ కాంగ్రెస్ హటాత్తుగా బీసీ రిజర్వేషన్స్ అంశంతో దూసుకుపోతుండటంతో ఇంతకాలం నిర్లిప్తంగా ఉండిపోయిన తెలంగాణ బీజేపిలో చలనం వచ్చినట్లే ఉంది.
ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి అందరినీ వెంటబెట్టుకొని దిల్లీ వెళ్ళి దీక్ష చేసినా కాంగ్రెస్ పెద్దలు ఎవరూ రానేలేదు. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఎక్కువ సమయం రాహుల్ గాంధీ భజన చేస్తూ, ప్రధాని మోడీని విమర్శించడంతోనే సరిపోయింది తప్ప బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడింది చాలా తక్కువ.
కాంగ్రెస్ పార్టీకి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తూ వారికి రిజర్వేషన్స్ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందే తప్ప వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్స్ బీసీల కోసమే అయితే నేను మద్దతు ఇస్తాను. కానీ దానిలో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్స్ ఉన్నాయి.
ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్స్ ఇస్తేనే హైకోర్టు కొట్టివేసినప్పుడు 10 శాతం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఎలా అనుకుంటున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి పంపిన బిల్లులో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే ప్రతిపాదనని వెనక్కు తీసుకుంటే, బీసీ రిజర్వేషన్స్ కోసం నేను చొరవ తీసుకొని ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్మూతో మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ సిద్దమేనా? అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.