నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ ధర్నా

బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ పెంచాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలు బీసీ సంఘాల నేతలు పాల్గొనబోతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ తదితరులు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాలో ఇండియా కూటమిలో పార్టీలు డీఎంకే, వామపక్షాలు, ఆర్‌జేడీ, సమాజ్ వాదీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) తదితర పార్టీల నాయకులు హాజరయ్యి సంఘీభావం తెలుపనున్నారు. సాయంత్రం ముగింపు సభలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ  పాల్గొంటారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ కల్పిస్తూ రాజ్యాంగంలోని 9వ షెడ్యూలలో చేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ వద్ద ఉన్నందున, కాంగ్రెస్‌ నేతలు గురువారం ఆమెను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వకపోతే రేపు రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.