మంత్రి పదవి వద్దంటూనే పాకులాడుతున్న రాజగోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిమీ మంత్రి పదవి లభించకపోవడంతో రోజురోజుకీ అసహనం పెరిగిపోతోంది. ఈరోజు తన అనుచరులతో కలిసి సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ మంత్రి పదవులపై మోజు లేదు, నేను కావాలనుకుంటే క్షణంలో మంత్రినవ్వగలను. కానీ నాకు మంత్రి పదవి కంటే మునుగోడు ప్రజలే ముఖ్యం. అందుకే నేను ఎప్పుడు ఇక్కడే ప్రజల మద్య ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నాను. 

మంత్రి పదవులు ఎవరు కోరుకుంటారంటే ఆ పదవి అడ్డం పెట్టుకొని వేలకోట్లు సంపాదించాలనుకునేవారు.. సంపాదించుకున్న ఆ సొమ్ముని కాపాడుకోవాలనుకునేవారే! అలా నిన్నగాక మొన్న వేరే పార్టీలో నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్లందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. కానీ పార్టీలో సీనియర్ నాయకుడినైన నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. 

ఇవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారో నాకు బాగా తెలుసు. నాకు మంత్రి ఇస్తారో ఇవ్వరో మీ ఇష్టం. నేను మాత్రం పదవి కోసం ఎవరి ఇంటికి పోను. ఎవరి కాళ్ళు  పట్టుకోను. నాకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుంటే లేదు. 

మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రజల మద్యనే ఉంటాను. వారి కోసం కొట్లాడేందుకు ఎంత దూరమైనా పోతాను. ఏ త్యాగానికైనా సిద్దపడతాను. నాకు మంత్రి పదవి కంటే నా ప్రజలు ముఖ్యం. పదేపదే మంత్రి పదవి ఇమ్మనమని ప్రాధేయపడలేను. ఇది నాకు చాలా అవమానకరంగా ఉంది,” అని అన్నారు.