సినీ కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి మద్దతు

తెలుగు సినీ కార్మికులు నేటి నుంచి జీతాల పెంపు కోసం సమ్మె మొదలుపెట్టారు. కానీ వారికి ఇప్పటికే మిగిలిన సినీ పరిశ్రమలలో కంటే చాలా ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామని ఇంకా పెంచడం సాధ్యం కాదని నిర్మాతల మండలి తెగేసి చెప్పింది. కార్మికులు సమ్మె చేస్తే కొత్తవారిని తెచ్చుకొని సినిమా షూటింగులు జరుపుకుంటామని హెచ్చరించింది. 

ఇటువంటి పరిస్థితిలో సినీ కార్మికులకు అనూహ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి మద్దతు లభించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడ తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “సినీ కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ సమస్యపై నిర్మాత దిల్ రాజు ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. 

ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత నేను సినీ కార్మికులతో మాట్లాడుతాను. అయినా సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నప్పుడు, కార్మికుల సమస్యలను నిర్మాతలు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? నిర్మాతలు మొండిగా వ్యవహరించకుండా సినీ కార్మికులకు జీతాలు పెంచి ఆదుకోవాలి,” అని అన్నారు. 

తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతూ,”తనని నేను మంత్రి పదవి ఇవ్వగలిగే పరిస్థితిలో లేను. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ అధిష్టానమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తనకి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం హామీ ఇచ్చిన విషయం నాకు తెలియదు,” అని అన్నారు.