బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి మాజీ సిఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అందరికీ తెలిసిన వివిద కారణాల చేత ఎక్కువగా ఫామ్‌హౌస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు.
కానీ ఇప్పుడు శాసనసభ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమీషన్ నివేదికని నిన్న మంత్రివర్గ సమావేశం ఆమోదించిన తర్వాత, సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు వైఫల్యానికి పూర్తి బాధ్యత మాజీ సిఎం కేసీఆర్‌దే. ఆయన అవినీతి, ఏకపక్ష నిర్ణయాల వల్లనే లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ నేపధ్యంలో కేసీఆర్ సోమవారం ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సుదీర్గంగా చర్చించారు. తన ప్రతిష్టని దెబ్బ తీసేందుకే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమీషన్ చేత నివేదిక వ్రాయించారని కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ తోడ్పాటు అందిస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ చేత మరో నివేదిక తయారు చేయించి ఇచ్చిందని కేసీఆర్ అన్నారు.
కనుక శాసనసభ సమావేశానికి హాజరయ్యి ఈ నివేదికలని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి నేనే అడ్డుకట్ట వేస్తానని కేసీఆర్ చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకొంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పారు.
కానీ ముందుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలు వివరించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్, హరీష్ రావులకు చాలా లోతైన అవగాహన, పట్టు ఉన్నాయి. కనుక ఒకవేళ కేసీఆర్ శాసనసభ సమావేశానికి హాజరైతే, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి మామూలుగా ఉండదు. మరి కాంగ్రెస్ పార్టీలో వారిని ఎదుర్కొనే మొనగాడు ఎవరో?