బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కి ఫ్యాక్స్ ద్వారా పంపిన రాజీనామా లేఖలో, “నేను బీఆర్ఎస్ పార్టీతో అనుబందం తెంచుకోవడానికి చాలా బాధపడుతూ తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మీ నాయకత్వంలో చాలా నేర్చుకున్నాను మీ అందరినీ వీడుతున్నందుకు బాధ పడుతున్నాను తప్ప మీ పట్ల నాకు ఎటువంటి శత్రుత్వం లేదు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం అవుతున్నప్పటికీ మీ పట్ల, పార్టీ పట్ల నా గౌరవం మారదు. చివరి వరుసలో ఉన్న వ్యక్తిని కూడా ముందుకు తెచ్చి నిలబెట్టడమే నా లక్ష్యం. రాజకీయంగా నా ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిన మీకు, బీఆర్ఎస్ పార్టీ సదా కృతజ్ఞుడిని,” అని లేఖ సారాంశం.
గువ్వల బాలరాజు 2007లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు కానీ బాలరాజు ఎన్నికలలో ఓడిపోయారు.
ఆ తర్వాత 2014,2018 శాసనసభ ఎన్నికలులో అచ్చంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. గువ్వల బాలరాజు 2022 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.
అయన ఈ నెల 9న బీజేపిన చేరబోతున్నట్లు సమాచారం. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో ఆయన బీజేపిలో చేరేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది.