కాళేశ్వరం కమీషన్‌ శాసనసభలో చర్చ తర్వాతే చర్యలు

సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించి ఆమోదం తెలిపారు. 

అనంతరం సిఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “నిపుణుల కమిటీ సూచనలు పట్టించుకోకుండా, మంత్రి వర్గం ఆమోదం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. కానీ అందరి ఆమోదంతోనే నిర్మించామని అబద్దాలు చెప్పారు. 

నీళ్ళ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పిన కేసీఆర్‌, సుమారు లక్ష కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన అధికారంలో ఉండగానే క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, సుందిళ్ళ బ్యారేజీలు బీటలు వారాయి. దీనికంతటికీ కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, అడుగడుగునా నిర్లక్ష్యమే కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ నివేదికలో స్పష్టం చేసింది. 

ఈ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్‌ పార్టీతో సహా అందరూ దీనిపై తమ అభిప్రాయాలు, వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించిన తర్వాతే చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

సిఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ బీసీ రిజర్వేషన్స్‌ పెంచాలని కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు డిల్లీ వెళ్ళారు. వారు 7వ తేదీన హైదరాబాద్‌ తిరిగి రాగానే లేదా ఆగస్ట్ 15 తర్వాత శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం కమీషన్ నివేదికపై చర్చించేం అవకాశం ఉంది.