ఎమ్మెల్సీ సీటు కోసం కేటీఆర్‌ మావగారికి కోటిన్నర ఇచ్చా కానీ...

కేటీఆర్‌ మావగారు పాకాల హరినాథ్ రావు, బావమరిది రాజ్ పాకాల పేర్లు అప్పుడప్పుడు మీడియాలో వినపడుతూనే ఉంటాయి. కానీ ఏదో ఓ వివాదంలో వినిపిస్తుండటమే విశేషం. తాజాగా నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలోని శివనేని గూడెం మాజీ సర్పంచ్ దేవనక దేవేందర్ వారిద్దరిపై సంచలన ఆరోపణలు చేశారు.

తనకు ఎమ్మెల్సీ సీటు ఇప్పిస్తానని వారు నమ్మకంగా చెప్పడంతో వారికి ఒక కోటి 68 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పారు. 

కానీ తనకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించలేదని కనుక తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా వారు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ప్రశాంతి నగర్‌లోని ప్లాట్ నంబర్: 810 తన పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారని దేవనక దేవేందర్ చెప్పారు. 

ఆ స్థలం విలువ ఎక్కువ కనుక తానే వారికి రూ.50 లక్షలు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. వారికి డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళ డ్రైవర్ శ్రీరాములు, బీసీ రిజర్వేషన్స్‌ సంఘం నాయకుడు రాజేందర్, ఈసీఎల్ ఉద్యోగి వందన ఇందుకు సాక్షులుగా ఉన్నారని దేవనక దేవేందర్ చెప్పారు. 

కానీ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో తనకు ‘ప్లాట్’ ఇచ్చి 50 లక్షలు పుచ్చుకునేందుకు మాటలు జరిగినప్పుడు మధ్యవర్తిగా ప్రగడ హన్మంత రావు అనే వ్యక్తి ఉన్నారని దేవనక దేవేందర్ చెప్పారు. 

గత ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్లాట్ రిజిస్ట్రేషన్‌కి గడువు పెట్టుకున్నామని కానీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించలేదు.. కోటిన్నర తిరిగి ఇవ్వలేదని దేవనక దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణపై కేటీఆర్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

(News & Video Courtesy: Big TV)