నల్గొండలో బీఆర్ఎస్‌ని నాశనం చేసిన ఓ లిల్లీపుట్.... కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఓ వ్యక్తి నాపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే యావత్ తెలంగాణ సమాజం స్పందించింది. కానీ బీఆర్ఎస్‌ పార్టీ నా అన్నదమ్ములు మాత్రం స్పందించలేదు. ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బీఆర్ఎస్‌ పార్టీలో ఓ పెద్ద నాయకుడే అతని చేత ఆ వ్యాఖ్యలు చేయించినట్లు నా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉంది. 

ఆ పెద్ద నాయకుడే తెలంగాణ జాగృతిలో కొంతమంది ద్వారా నా గురించి ఎప్పటికప్పుడు నా గురించి సమాచారం తెలుసుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఆయనకు తెలియని విషయం ఏమిటంటే, నేను కూడా బీఆర్ఎస్‌ పార్టీలో కొందరి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాను. 

నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీని నాశనం చేసిన ఓ లిల్లీపుట్ బీఆర్ఎస్‌ నేత నా గురించి ఏదో వాగుతున్నట్లు విన్నాను. ఆయన తన పరిధిలో ఉంటే మంచిది,” అని కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. 

బీఆర్ఎస్‌ పార్టీలో ఆ పెద్ద నాయకుడు కేసీఆర్‌ కాదనుకుంటే కేటీఆర్‌, హరీష్ రావు కనిపిస్తున్నారు. వారిద్దరిలో కేటీఆర్‌ ఆమెకు సోదరుడు కనుక ఆమె హరీష్ రావుని ఉద్దేశ్యించి ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. 

ఇక ఆమెకు, బీఆర్ఎస్‌ పార్టీకి మద్య అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందని, పైగా కోవర్టు ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయని ఆమె మాటలతోనే స్పష్టమవుతోంది. 

కేసీఆర్‌ నేటికీ కేటీఆర్‌, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ముగ్గురికీ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ కూతురునైన తనపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్‌ పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. సహజమే కదా?