వాళ్ళని బయటకు పంపాలి: కవిత డిమాండ్

తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ఎన్టీవీ ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలు మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే, “నేను మా తండ్రిగారికి వ్రాసిన ఆ లేఖను ఎవరు మీడియాకు లీక్ చేశారో వారిని పార్టీ నుంచి బయటకు పంపాలని కోరాను. కానీ పట్టించుకోలేదు. కనుక నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను. బీఆర్ఎస్‌ పార్టీతో నాకు అభిప్రాయభేదాలే తప్ప భేదాభిప్రాయాలు లేవు. 

కానీ నేను బీఆర్ఎస్‌ పార్టీలో సభ్యురాలిని. కనుకా పార్టీకి, నా తండ్రి ప్రతిష్టకి భంగం కలిగించే పనులు ఎప్పడూ చేయను. నా లేఖ మీడియాకు లీక్ చేసిన వ్యక్తులే ఏపీ బీజేపీ ఎంపీ సిఎం రమేష్ చేత బీజేపీలో బీఆర్ఎస్‌ పార్టీ విలీనం గురించి, కేటీఆర్‌ గురించి ఆవిదంగా మాట్లాడించి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. 

నేనేమీ కాంగ్రెస్‌ లేదా బీఆర్ఎస్‌ పార్టీకి పోటీగా నిరాహారదీక్ష చేయడం లేదు, బీసీ రిజర్వేషన్స్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నందుకే నిరసన తెలియజేసేందుకు దీక్ష చేపడుతున్నాను. గుజరాత్‌లో కూడా ముస్లింలకు రిజర్వేషన్స్ అమలుచేస్తున్నప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు అభ్యంతరం దేనికి అనేదే నా ప్రశ్న. 

సెప్టెంబర్‌ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటిలో బీసీ రిజర్వేషన్స్‌ కోసం ఆర్డినెన్స్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ మోసపూరితంగా వ్యవహరిస్తోంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.