మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు

మంత్రి కొండా సురేఖపై ఈ నెల 21 లోపుగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కొన్ని నెలల క్రితం ఆమెపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు కూడా వేశారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోలీసులకు ఈ ఆదేశం జారీ చేసింది. 

మంత్రి కొండా సురేఖ కొన్ని నెలల క్రితం కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కూడా ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించాయంటూ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఆమె ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఈ రెండు కేసులు ఆమె మెడకు చుట్టుకున్నాయి. తరచూ ఇటువంటి వివాద స్పద వ్యాఖ్యలు చేస్తూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఇటువంటి కేసులో చిక్కుకోవడంతో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆమెను సిఎం రేవంత్ రెడ్డి పదవి నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

తనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనే కోర్టు ఆదేశాలపై ఆమె స్పందిస్తూ, “న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన నమ్మకం ఉంది. కేసులు, కొట్లాటలు నాకు కొత్తేమీ కాదు. నా జీవితమే ఓ పోరాటం. దానిలో ఈ కేసు కూడా ఓ భాగమే,” అని అన్నారు.