మాజీ ప్రధాని, కర్ణాటకలోని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకి అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తున్నట్లు బెంగళూరులో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నేడు తుది తీర్పు చెప్పింది.
ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే నేడు తుది తీర్పు వెలువరిస్తూ, జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షలు జరిమానా కూడా విధించారు. దానిలో రూ. 7 లక్షలు బాధితురాలికి చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
శుక్రవారం ఇదే న్యాయస్థానంలో ప్రజ్వల్ రేవణ్ణని ఆయన దోషిగా ఖరారు చేసినప్పుడు కోర్టు హాలులోనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. బయటకు వచ్చి మీడియా ముందు కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు.
ఈరోజు న్యాయమూర్తి శిక్ష ఖరారు చేస్తున్నప్పుడు కూడా ప్రజ్వల్ రేవణ్ణ కన్నీళ్ళు పెట్టుకొని దయచేసి శిక్ష తగ్గించమని వేడుకొన్నారు. కానీ “మీరు చేసిన చాలా హేయమైన నేరానికి ఇదే సరైన శిక్ష,” అని న్యాయమూర్తి నిష్కర్షగా చెప్పారు.
ఈ కేసు వివరాలలోకి వెళితే... ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబానికి బెంగళూరు శివారులో గన్నిగడ అనే ప్రాంతంలో ఓ ఫామ్హౌసు ఉంది. దానిలో పనిచేస్తున్న ఓ మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ పలుమార్లు అత్యాచారం చేశారు. ఆమెను బయటకు వెళ్ళనీయకుండా లోన బందించి అత్యాచారం చేస్తూనే ఉన్నారు.
ఆ ఫోటోలు, వీడియోలు ఆమె కూతురుకి చూపిస్తూ ఆమెపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడారు. చివరికి ఆమె 2024, ఏప్రిల్ 28న స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో ప్రజ్వల్ రేవణ్ణ భాగోతం బయటకు పొక్కి జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోనే ప్రజ్వల్ రేవణ్ణకి జీవిత ఖైదు విదించబడింది.