కేసీఆర్ హయంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పధకంలో రూ. 1,000 కోట్లుపైనే కుంభకోణం జరిగిందని ఈడీ ప్రకటించింది. పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పనిచేసిన కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయగా 200కి పైగా లబ్ధిదారుల పాసు పుస్తకాలు లభించాయి.
వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఏడు జిల్లాలలో రూ.253.93 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలిపి రూ. 1,000 కోట్లు పైనే అవినీతి జరిగినట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన ఈ సొమ్ముని ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలలోకి మళ్ళించినట్లు కనుగొన్నామని తెలిపారు.
ఇంకా దిగ్బ్రాంతి కలిగించే విషయమేమిటంటే, కళ్యాణ్ ఇంట్లో లభించిన లబ్ధిదారుల పాసు పుస్తకాలలోని బ్యాంక్ ఖాతాలను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆడేందుకు కూడా ఉపయోగించుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు.
కనుక గొర్రెల పంపిణీ పేరుతో కేసీఆర్ హయంలో జరిగిన ఈ వెయ్యి కోట్ల కుంభకోణం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెప్పడంపై ఆయన ఇంకా స్పందించవలసి ఉంది.