మేము ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం లేదు: హరీష్ రావు

బనకచర్ల ప్రాజెక్టుపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం ఏమీ మాట్లాడకపోవడంతో బీఆర్ఎస్‌ పార్టీ చాలా అసహనం కలిగించడం సహజమే. ఏపీ లేదా తెలంగాణ మంత్రులు స్పందించి మాటకు మాట చేపుతుంటేనే బీఆర్ఎస్‌ పార్టీ తన వాదనలు వినిపిస్తూ ప్రజలను ఆకట్టుకోగలదు. లేకుంటే ఒంటి చేత్తో చప్పట్లు కొట్టే ప్రయత్నంగానే మిగిలిపోతుంది. 

ఈ పేరుతో హరీష్ రావు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల పేర్లు ముడివేసి ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ తొలిసారిగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ కొద్దిగా స్పందించడంతో హరీష్ రావు హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి విరుచుకుపడ్డారు. 

 మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ, “తెలంగాణ భూభాగం దాటి ఏపీలోకి ప్రవహిస్తున్న నీళ్ళు సముద్రంలో కలుస్తుంటే వాటిని మేము రాయలసీమకు మళ్ళించుకుంటామంటే మీకెందుకు అభ్యంతరం?మేమేమీ కాళేశ్వరం ప్రాజెక్టుకి కన్నం చేసి నీళ్ళు ఏపీకి పట్టుకుపోవడం లేదు కదా? నీళ్ళ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు?” అని ప్రశ్నించారు. 

వెంటనే హరీష్ రావు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి, “మా నీళ్ళ కోసం మేము పోరాడితే అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? మేము మా బతుకు తెరువు, మా ప్రజల బతుకు తెరువు. మా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాము. మా సిఎం ఈ విషయం గురించి మాట్లాడటం లేదు గనుక మేము మాట్లాడుతున్నాం. సాగునీటి శాఖ గురించి అవగాహన లేకుండా నారా లోకేష్‌ ఏదేదో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు వలన మాకు నష్టం కలుగుతుంది కనుకనే మేము పోరాడుతున్నాము. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాము. ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కానే కాదు,” అని అన్నారు.