మాజీ ప్రధాని, కర్ణాటకలోని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవగౌడకు ఈ వయసులో పెద్ద షాక్ తగిలింది. ఆయన మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణని అత్యాచారం కేసులో దోషిగా బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నేడు నిర్ధారించింది. అతనికి రేపు శిక్ష ఖరారు చేస్తామని తెలిపింది.
గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బయటపడినప్పుడు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది.
బెంగళూరు సమీపంలో హసన్ వద్ద ప్రజ్వల్ రేవణ్ణకి ఒక ఫామ్హౌసు ఉంది. దానిలో పనిచేస్తున్న మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడేవాడు. అతను తన తల్లిని పలుమార్లు అత్యాచారం చేసి ఆ వీడియోలను చూపిస్తూ తమని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తుండేవాడని, లైంగికంగా వేదిస్తుండేవాడని ఆ మహిళ కుమార్తె పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ఫామ్హౌసుకి వెళ్ళి లోపల బందీగా ఉన్న ఆ యువతీ తల్లిని విడిపించి తీసుకువచ్చారు. పోలీసులు రేవణ్ణపై కేసు నమోదు చేసి అతను జర్మనీ నుంచి తిరిగి రాగానే అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు కోసం ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి లోతుగా విచారణ జరిపారు. వారు 123 మంది సాక్షులను ప్రశ్నించి అనేక ఆధారాలు సేకరించారు. 2024, డిసెంబర్ 31న ప్రత్యేక న్యాయ స్థానంలో 2,000 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వాటి ఆధారంగా విచారణ జరిపిన న్యాయస్థానం ప్రజ్వల్ రేవణ్ణని దోషిగా నిర్ధారించింది.
రాజకీయంగా ఇంత పలుకుబడి, అత్యున్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా పోలీసులు విచారణ జరపడమే చాలా కష్టం. అటువంటిది కేవలం ఏడు నెలల్లో విచారణ కూడా పూర్తి చేసి దోషిగా నిర్దారించడం, శిక్ష ఖరారు చేస్తుండటం చాలా అభినందనీయమే.