ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపధ్యంలో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, “ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మరో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను, రెండు పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్ నేతలను నయాన్నో, భయాన్నో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెస్‌కి చెందిన సబితా ఇంద్రారెడ్డి, టీడీపికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. నేటికీ వారు మీ పక్కనే ఉన్నారు కదా?
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టేసి ఎప్పటికీ తనే ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ అనుకున్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ఏక పాత్రాభినయం చేశారు. ఇవన్నీ మరిచిపోయినట్లు ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. వారికి దీని గురించి మాట్లాడేందుకు నైతిక హక్కు కూడా లేదు.
అయినా సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో చదవకుండా దానిని తమకు అనుకూలంగా అన్వయించుకొని ఏదేదో మాట్లాడేస్తున్నారు. సుప్రీంకోర్టు స్పీకర్‌కి ‘డైరెక్షన్’ మాత్రమే ఇచ్చింది. ఈ వ్యవహారంలో స్పీకర్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని సుప్రీంకోర్టు చెప్పింది కదా?” అని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందే స్వయంగా ఓ ఫిరాయింపుదారు. ఆయన గతంలో టీడీపి నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి మరిచిపోయి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సిగ్గుచేటు.
2014 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిస్తే తర్వాత ఆ సంఖ్య 90కి ఎలా పెరిగిందో చెప్పగలరా?2018 ఎన్నికలలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా?
ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరనే విషయం తెలిసి కూడా అప్పుడే కేసీఆర్, కేటీఆర్‌లు విజయం సాధించేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు,” అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు.