కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సుదీర్గంగా చర్చించారు.
సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయక తప్పదని వారు అభిప్రాయపడ్డారు. కనుక న్యాయ నిపుణులతో చర్చించి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకునేందుకు రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే దీనిపై కూడా సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు తాజా తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “సుప్రీం కోర్టు ఆదేశం మేరకు మూడు నెలల్లోగా 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదు. కనుక ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు అందరూ సిద్దంగా ఉండాలి,” అని పిలుపునిచ్చారు.